Thursday, February 23, 2012

చిరాకు మనుషులతో...

ఈ ప్రపంచంలో అందరూ ఒకేలాంటి మనుషులుండరు. కొంతమందిని చూడగానే సంతోషమవుతుంది. కొంతమంది రకరకాలుగా చిరాకు పెడుతుంటారు. బంధువులు, పరిచయమైనవారు మాత్రమే ఇలాంటి వారయితే, వాళ్లను తప్పించుకుని బతకడానికి మనం ప్రయత్నం చేస్తాము. కానీ పొరుగింటివారు, ఇంట్లోవారు, తోటి ఉద్యోగులు చిరాకుపెట్టేవారయితే, వాళ్లను తప్పించుకోవడం కుదరదు. వారితో కలిసి కొనసాగాలంటే చేయవలసిన పనిమీదకన్నా మనల్ని మనం అదుపులో పెట్టుకోవడం మీద ఎక్కువ ధ్యాస అవసరమవుతుంది. ఇలాంటి తోటి ఉద్యోగులు ఉండటం మామూలే. వాళ్ళని తప్పించుకుంటే పని జరగదు. మరి ఏం చేయాలి?


మనం అదుపులో ఉండాలి

ఈ చిరాకు మనుషులతో కొంత బాధ ఉంటే ఫరవాలేదు. అసలే కుదరకపోతే మాత్రం సమస్య! ఈ రకం మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, మన మాటలకు ఏ రకంగా రియాక్ట్ అవుతారు అని ముందే ఊహించడం దండగ. మన ప్రవర్తన మన చేతుల్లో ఉంటుంది కనుక మనల్ని మనం అదుపులో ఉంచుకుని, చిరాకు పడకుండా ఉంటే సరి. ఒత్తిడి కలుగుతుంది, తప్పదు. కానీ, రాను రాను అలవాటవుతుంది. అప్పుడు, ఆ చిరాకు కూడా అలవాటవుతుంది!

మన అసంతృప్తి మనతోనే ముగిస్తే మంచిది

అసంతృప్తి కలిగినప్పుడు, దాన్ని ప్రదర్శించటం సహజం. అది అలవాటయినప్పటికీ, లోపల రగులుతూనే ఉంటుంది. మన భావాలు సరయినవే. అవి మరెవరయినా చెపితే సంతృప్తి కలుగుతుంది. అందుకని, ఈ చిరాకు మనుషుల గురించి మరో మనిషి దగ్గర చర్చచేయడం మనకు అవసరమనిపిస్తుంది. సందర్భం వచ్చినవెంటనే ‘అసలు ఏమయిందంటే’ అంటూ ఫిర్యాదులు చేయకుండా ఉండగలగాలి. నిజానికి ఫిర్యాదుల కారణంగా మన వ్యక్తిత్వం కొంత దెబ్బతింటుంది. ఓపిక లేనివారని మనకు పేరు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక చిరాకు. కొలీగ్ గురించి ఆఫీసులో, కంపెనీలో చర్చించకుండా ఉండటమే మేలు. నమ్మకమయిన బయటివారితో, వారి గురించి చర్చించి కొంత ‘మంటను’ చల్లార్చుకోవచ్చు.

చిరాకు మనవల్ల కలుగుతున్నదేమో?

మనం మాటమాటకూ చిరాకుపడటం మానేశాము. మిగతా వారితోనూ చర్చించడం లేదు. అప్పుడు ఆలోచనను మనమీదకు మళ్లించాలి. చిరాకు వ్యక్తి గురించి మనకు నచ్చని అంశాలు, ఆలోచనలను గురించి ఆలోచించగలగాలి. మన ఆలోచనలు, వాళ్ల ఆలోచనలు వేరుగా ఉంటాయా? వారిలో మనం, మనకు నచ్చని మరో వ్యక్తి పోలికలను చూస్తున్నామా? లేక ఎక్కడయినా మన ఓర్వలేనితనం, తన ప్రభావం చూపుతున్నదా? ఆలోచించండి. ఎదుటివారిని అంచనా వేయడంలో అసూయకు, అసహనానికి చోటులేదు. ఒకరు మనలాగా లేనంత మాత్రాన, ఆలోచించనంత మాత్రాన వారిని చిరాకు మనుషులనడం మన తప్పు అవుతుంది. ఈ చిరాకులో మన పాత్రను గుర్తుంచుకుంటే మేలు. మనకు మరీ ఎక్కువమంది చిరాకు మనుషులు ఎదురయితే, సమస్య మనలో ఉందని కూడా అర్థం!

వారితో మరింతకాలం గడపగలిగితే

నచ్చని మనుషులతో, మరింతగా కలిసి పనిచేసే అవకాశం వస్తే, వారి లోతుపాతులు, మనలో లోపాలు మరింత బాగా బయటపడతాయి. వారిని తప్పించుకోవాలనే ఆలోచన నుంచి, కలిసి పనిచేసే దాకా మారడానికి చాలా ఓపిక కావాలి. ఆ మార్పు జరిగితే ‘మంచివారే, మాట తీరు మాత్రమే చిరాకు’ అనిపించవచ్చు. ఆ మాట తీరు, మనిషి తీరులకున్న కారణాలు కూడా మనకు కనిపించే అవకాశం ఉంటుంది. చివరకు వారిమీద సానుభూతి కూడా పుట్టవచ్చు కానీ, ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నైతికత కారణంగా చిరాకు కలిగించేవారిని తప్పించుకోవడమే, మంచిదారి. మిగతా లోపాలను భరించవచ్చు మార్చవచ్చు!
నేరుగా చెప్పడానికి ప్రయత్నించండి


మన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అప్పుడిక సూటిగా ‘మీరిలా ప్రవర్తిస్తున్నారు. మీకేమయినా తోచిందా?’ అని అడగవచ్చు. చాలామందికి తమప్రవర్తన గురించి ఆలోచన ఉండదు. అంతా బాగనే ఉంది, అనుకుంటారు. చాలామంది విషయం చెపితే మారటానికి ప్రయత్నిస్తారు కూడా! ఈ ప్రపంచంలో ఫీడ్‌బ్యాక్‌ను, నిర్భయంగా, నిస్సందేహంగా ఇచ్చేవారు కరవు. మీరు ఆ పని చేయగలిగితే, దానివల్ల మంచి ప్రభావం ఉండే వీలు ఉంది.


కానీ, మనమిచ్చే ఈ ఫీడ్‌బ్యాక్ నిజంగా, నైపుణ్యంతో జరగాలి. లేకుంటే వారి హృదయానికి సూది గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంది. ఎదుటివారి గురించి మన అభిప్రాయం చెప్పేముందు, మన గురించి వారి అభిప్రాయాన్ని వినే ఓపిక కూడా మనలో ఉండాలి. లేకుంటే పేచీలు తప్పవు!


వదిలేయండి

కొంతమందితో ఏ ఉపాయమూ పని చేయదు. వారిని వదిలేయడం కన్నా తోవ లేదు. చిరాకును పట్టించుకోనవసరం లేదు. మనం బాధపడడం మానేస్తే, బాధే లేదు.

గుర్తుంచుకోండి

మన ప్రవర్తన అదుపులో ఉండాలి. మన ప్రతి క్రియ, ఆలోచనలు అదుపులో ఉంటే ఇక సమస్య లేదు. చిరాకు మనుషులను అర్థం చేసుకునే ప్రయత్నం మంచిది.

తప్పంతా ఎదుటివారిదే అనుకోవడం తప్పు. చిరాకుకు మనం కూడా కారణమేమో? మనలో నెగెటివిటీ ఉన్నందుకు, అది ఎదుటివారిలో ప్రతిఫలిస్తున్నదేమో గమనించగలగాలి. పేచీ పెట్టుకోవం మంచిది కాదు. కానీ నిజం చెప్పగలిగితే లాభం ఉండవచ్చు!

No comments:

Post a Comment