Friday, January 27, 2012

జగమెరిగిన సత్యం

ఈప్రశ్నకు బదులేదీ? నా బాధకు అంతం ఏదీ?’ అంటూ పాతకాలం సినిమా హీరో శాలువా కప్పుకుని, ఎండిపోయిన చెట్లకింద పాటలు పాడేవాడు. అందరి మనసులలోనూ అట్లా పాడాలని ఉంటుంది గనుక, శాలువాతోసహా ఆ పాట, ఆ సినిమా హిట్టయిపోయేది. కానీ, ఇది పద్ధతి కాదని మనుషులకు తెలిసిపోయినట్లుంది. ఇవాళ సినిమాలో హీరో, చివరకు ప్రేమను కూడా బలవంతంగా పొందగలననుకుంటున్నాడు. ‘ఐ లవ్ యూ’ చెప్పకపోతే తంతానంటాడు. అక్కడా, యిక్కడా విషయం ఒక్కటే! మనకు ఏం కావాలో మనకు తెలియదు. కావలసినదాన్ని సాధించే మార్గం ఏమిటో మనకు తెలియదు.

‘ఎలాగున్నారు?’ అని అడిగితే ‘ఏదో నడుస్తున్నది!’ అని తప్ప ‘నిక్షేపంగా ఉన్నాను’ అనగలిగినవారు ఆనాడూ లేరు ఈనాడూ లేరు! బతుకులు నడుస్తున్నాయంతే. తేడా కూడా వచ్చింది. నిజంగా మనసులో కోరిక ఉంటే, బతుకు, దారి గురించి చెప్పే మనుషులు వచ్చారు. ‘ఈ ప్రశ్నకు బదులేదీ?’ అని మనుషుల మధ్యన నిలబడి అడిగి చూడండి. బహుశః అనుకున్నదానికి నాలుగురెట్లు ఎక్కువ మంది ఎదురువచ్చి ‘పద! బదులు చూపిస్తాను!’ అంటారు! లేకుంటే, మీరు ఈ అక్షరాలు ఎందుకు చదువుతున్నట్టు? అంతా కలిసి ప్రశ్నలకు తగిన సమాధానాలు వెదుక్కోవడానికి కాకపోతే, ఈ సోది ఎందుకు?


అవసరమయింది ఏదో ఒక దారి. కానీ, అన్ని దారులే అయితే అది మరో కష్టం! ప్రపంచమంతా గురువుదే. ప్రపంచమంతటా ప్రవచనాలే. మిగతా పుస్తకాల సంగతి ఎట్లున్నా పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సెల్ఫ్ మేనేజ్‌మెంట్ లాంటి అంశాల గురించి మాత్రం కుప్పతెప్పలుగా పుస్తకాలు వస్తున్నాయి. నిజానికి వాటి దొంగ కాపీలు సిద్ధం చేసి తక్కువ ధరలకు అమ్ముతున్నారు. కలిగినవారు లక్షలుపోసి, కొందరు చెప్పే మంచి మాటలు వింటున్నారు. కొందరు పుస్తకాలు కొంటున్నారు. కొందరు తమ తోటి వారితో చర్చిస్తున్నారు. అందరికీ మనసులో ఒకే ప్రశ్న! ‘ఈ ప్రశ్నకు బదులేదీ?’ అని. శాలువా ఒకటి మాత్రం లేదు!


‘ఇంతకూ తమరి బాధ ఏమిటో?’ అని ఎవరైనా అడిగారా? ఒకవేళ అడిగితే జవాబేమిటి?’ మనకు ఏం కావాలి?


‘ఏ పని చేసినా, నేననుకున్నట్టు జరగాలి’. సాధారణంగా చాలామంది బాధ ఇదే. బతుకు, ఉద్యోగం, సంపాదన, ప్రేమ, అభిమానం లాంటి లిస్టులో ఏది ముట్టుకున్నా మనం అనుకున్నట్టు జరగాలి. ‘విజయం’ నా స్వంతం కావాలి! అందరిదీ ఒకటే బాధ. ఈ ప్రపంచంలో అందరూ విజయపథంలో నడవాలి. అంటే ముందు, ఆ దారి తెలిసి ఉండాలి. అక్కడ మనకు చోటు దొరకాలి. తీసుకుపోయే గుంపులో మనమూ ముందుకు సాగగలగాలి! ఇదేమీ అనుకున్నంత సులభం కాదని, పాఠాలు చెప్పేవారంతా చెపుతూనే ఉన్నారు!


ప్రశ్నకు బదులు ఉంది. అది నిజానికి మనలోనే ఉంది. నేను సంతోషంగా ఉన్నాను అంటున్న మనిషి, నిజంగా నూటికి నూరుపాళ్లు సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్న. ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని, ‘నేను పడిన శ్రమకు, అందిన ఫలితం బాగానే ఉంది మరి’ అనుకుంటే, అంతా బాగుంటుంది. మరింత కష్టపడడానికి ఉత్సాహంగానూ ఉంటుంది.
పాఠాలు చెప్పేవారు పదిమంది ఉండవచ్చు. మార్గం వేరయినా, అందరూ ఒకే పద్ధతి గురించి చెపుతారు! ఆ సూచన అందుకోవడం మన పని. అందుకు తగిన రీతిలో మసలుకోవడం మన పని! అనుక్షణం, ప్రయత్నంలో మునిగి ఉండడం మన పని! ఈ తత్వం అర్థమయితే, మరుక్షణం నుంచి మన తీరు, మన మాట తీరు, మన బతుకు తీరు మారుతుంది. ఆనందం, అడిగి తెచ్చుకుంటే వచ్చేది కాదు. విజయం, వేరెవరో ఇస్తే దొరికేది కాదు! అవి మనసులోనుంచి మన కృషితో బయటకు రావాలి.
‘గుడ్డులోపల నుంచి -పగిలితే జీవం పుడుతుంది. బయట నుంచి పగలగొడితే జీవం చస్తుంది!’ ఆలోచన మారితే ఆచరణ మారుతుంది!
నేను మారగలను, మార్చబడగలను. మళ్ళీ మరో మనిషిగా కొనసాగగలను! ఇది కేవలం మానసిక పరిస్థితికి సంబంధించిన విషయం.
నా సమస్యలకు జవాబులు వెదకగలిగేది నేను మాత్రమే.
నా సమస్యలను నేను నిర్ణయించుకుని, వాటి వేపు సాగడం నాకు తెలుసు. అందుకు అనువుగా, నా ఆలోచనలను, కార్యక్రమాలను, ఇష్టాయిష్టాలను, నిర్ణయించే శక్తి నాకుంది.


గమ్యం నుంచి నా దృష్టి పక్కకు కదులుతుంటే, ఆ సంగతి నాకు అర్థమవుతుంది. నేను దానిని తిరిగి మార్చుకుంటాను. నా తీరుకు మీరెవరూ బాధ్యులు కారు. నా నిర్ణయాలు నేను తీసుకుంటాను. నా జయాపజయాలకు, నా బతుకుకు నూటికి నూరు శాతం నేనే బాధ్యత వహిస్తాను.


ఈ ప్రయత్నంలో నిరాశకు చోటులేదు. ప్రతి అడుగూ ముందుకే సాగుతుంది. అడుగడుగునా కొత్త ఆలోచనలు పుడతాయి. నా కొరకు ఆలోచించే వారంతా నా వెంట ఉన్నారు. అలాంటివారిని వెదికి, వారి చేయూతతో ముందుకు సాగుతాను!


అందుకు నేను చేయదగిన ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అందిన విజయాన్ని గౌరవిస్తాను. కనిపించిన గొప్పదనాన్ని ఆదరిస్తాను.
నేను తలుచుకుంటే, నా బతుకును, నాకు నచ్చిన దారిలో నడిపించగలనన్న నమ్మకం నాకు కలిగింది!


విజయం రహస్యం కాదు! అది జగమెరిగిన సంగతి!

1 comment:

  1. నేను పడిన శ్రమకు, నా తెలివికి తగిన ఫలితం వచ్చిందనుకోలేక బాధపడిపోతున్నారు.

    ReplyDelete