Wednesday, November 2, 2011

బికమింగ్ బుద్దా - ఒక సమీక్ష



Becoming Buddha - A review


బికమింగ్ బుద్ధా
ఎడిటర్: రేణుకా సింగ్
పేజీలు: 184 - వెల: రూ. 399/-
పెంగ్విన్ ఆనంద ప్రచురణ

బౌద్ధం భారతదేశంలో పుట్టింది ఇక్కడి నుంచే ఎన్నో దేశాలకు వ్యాపించింది. వాటిలో టిబెట్ కూడా ఒకటి. 1959లో టిబెట్‌లో చైనా ఆక్రమణ కారణంగా సంక్షోభం ఏర్పడింది. అప్పుడు దలైలామా, ఆయన గురువులు లక్షమంది టిబెటన్లకు ఆశ్రయమిచ్చింది. టిబెటన్ బౌద్ధులకు, భారతదేశం ‘ఆర్యభూమి’. టిబెటన్ బౌద్ధమంటే భారతీయ బౌద్ధమే అందుకే కృతజ్ఞతా పూర్వకంగా టిబెట్ వారు 1979లో, రాజధాని ఢిల్లీ నగరంలో తుషిత మహాయాన ధ్యాన కేంద్రాన్ని స్థాపించారు. దలైలామాతో సహా ఎందరెందరో బౌద్ధ ఆచార్యులు అక్కడ ప్రవచనాలు చేశారు. పాఠాలు చెప్పారు. ఆ ప్రవచనాలు 1979 నుంచి జరుగుతున్నాయి. వాటిలో పన్డింనెండింటిని ప్రస్తుతం కేంద్రం నిర్వహణ బాధ్యతలు వహిస్తున్న రేణుకా సింగ్ గారి సంపాదకత్వంలో సంకలనంగా ప్రకటించారు.

పుస్తకానికి అర్థవంతమయిన జీవనం కొరకు బౌద్ధిక సంస్కృతి అని అర్థం వచ్చే ఉపశీర్షిక పెట్టారు. మహాయాన బౌద్ధం ఏకంగా నిర్యాణం కొరకు ప్రయత్నించదని అర్థమవుతుంది.

మనిషికిగల కోరికల కారణంగా కొంత ఆత్మతత్త్వం తెలియక కొంత అందరూ కష్టాల పాలవుతున్నారు. మనం జంతువులవలె బతకగూడదు. తెలివిగల వారలం గనుక మనమూ బుద్ధులం కావాలి అని ఈ ఉపశీర్షికకు వ్యాఖ్యానం చెప్పవచ్చు! అందరూ తనలాగే ఆలోచనతో జ్ఞానం పొందాలి అంటాడు బుద్ధుడు. తెలివిగల వారు ముందు జీవితం సంతోషంగా గడపాలంటారు. ఇంకా తెలివిగలవారు జీవితంలో చక్రనేమి అనుభవాలు రాకుండా ప్రయత్నిస్తారు. అందరికంటే తెలివిగలవారు అందరికోసం జ్ఞానోదయం కొరకు పాటు పడతారని గౌతమ బుద్ధుడంటాడు. ఈ సంప్రదాయాన్ని సవివరంగా అయినా, సులభంగా వివరించిన ఈ ఉపన్యాసాల సంకలనం, బౌద్ధం మీద ఆసక్తిగల వారికి ఆదర్శగ్రంథం. అలాగని, మిగతావారికి దీనితో పనిలేదనుకుంటే తప్పే.

నమ్మినవారికి కూడా ఆలోచన కలిగించే పద్ధతిలో ఎంతో గొప్పగా ఉన్నాయి ఇందులోని ప్రసంగాలు.
మొదటి ప్రసంగం చదివితే చాలు, అప్పటివరకు ఆయన పేరు వినని వారికయినా సరే, ఆయనమీద గొప్పగౌరవం కలుగుతుంది. ‘ఇది మనకు కాదు!’ అని మామూలు వారు అనుకునే విషయాన్ని ఆయన, చిన్న పిల్లలకు కథ చెప్పినంత సులభంగా చెప్పారు. మామూలు మనుషులు సత్యాలను చూడలేకపోతారు. బౌద్ధం సత్వాన్ని చూడగల తెలివిని ఇస్తుంది. నీకు నీవే రక్షకుడవు. శత్రువువు. బుద్ధుడు నిన్ను రక్షించడు. కర్మను అనువర్తించితే అది నిన్ను రక్షిస్తుంది అని చెప్పిన తీరు, అందరికీ అర్థమయ్యేట్లుగా ఉంది. పుస్తకంలోని అన్ని ఉపన్యాసాలు ఇంత సులభంగా ఉన్నాయనలేము గానీ ఏదీ అర్థంకాని రకంగా లేవని మాత్రం చెప్పవచ్చు. ధర్మమని ఒకటి ఉందంటే అవునని ఊరుకుంటే చాలదు. ధర్మంతో మనకు సంబంధం ఉండాలి అంటారు రామా తుబ్‌టెన్ యేషే. ఈ భావం అందరికీ అర్థమయితే ఎంతో మేలు జరుగుతుంది. కొన్ని అంశాలను గురించి సనాతన బౌద్ధం కనబరిచే తీరు మరాలి అని దలైలామా అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

బౌద్ధ వాఙ్మయంలో గతంలో తప్పులు దొర్లినట్లు ఆయన అనడం అంతకన్నా ఆశ్చర్యకరం. బోధిచిత్తం గురించి క్యాబ్జే లింగ్ రిన్‌పోచ్ మాటలు కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతాయి. బోధిచిత్తం ఉంటే అందరూ బోధి సత్యులవుతారు అంటారాయన. పుస్తకం చివరన పాలిటిక్స్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ పేరునగల ప్రొఫెసర్ రాబర్ట్ తుర్మన్ గారి ఉపన్యాసం సమకాలీన సమస్యలను, జీవనాన్ని గురించి వ్యాఖ్యానిస్తుంది. మిగతా ప్రసంగాలలో అంతా సాంప్రదాయక విషయాలే ఉన్నాయి. బౌద్ధం గురించి బాగా తెలిసిన వారికి ఈ చివరి ప్రసంగవ్యాసం ఎక్కువ నచ్చుతుంది. జీవులపట్ల ప్రేమ, బోధనలను హేతువాదంతో విశే్లషించడం, సాధనలు బౌద్ధానికి ప్రాణప్రదమయిన అంశాలని మొత్తం మీద అర్థమవుతుంది. తుర్‌మన్ ప్రసంగ వ్యాసంలో మాత్రం కర్మసిద్ధాంతాన్ని గురించి చేసిన వ్యాఖ్యానాలు అందరినీ ఆలోచనకు గురి చేస్తాయి. ఆ ఆలోచన నమ్మకాలనుబట్టి మరీ తీవ్రంగా ఉంటే ప్రమాదం కూడా ఉంది.
అర్థవంతమయిన జీవనం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి గలవారు ఇంగ్లీషు అర్థం చేసుకోగలిగితే ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి!

No comments:

Post a Comment